పువ్వుల్లో దాగున్న పళ్లూ, సీతాకోక ఒళ్లూ నిజంగా అతిశయాలే. అంతకు ఎంత మాత్రమూ తీసిపోని అతిశయాలు ఈ జీవులు. ఎందుకంటే ఒంటి మీద లేలేత చిగుళ్లు మొలిచినట్టు, చిట్టి రెమ్మలు, తీగలూ పారినట్టు కనిపిస్తాయి ఈ ప్రాణులు. వీటిలో సంద్రంలో ఉండే సిత్రం ఒకటైతే చెట్టు కొమ్మల్లో రెమ్మల్లా కలిసిపోయేవి మరో రకం. ఎంత వింత ఇంత జీవులో… అని పాడుకునేలా ఎన్నో విశేషాలుఉన్నాయి వీటిలో! తెలుసుకుందాం పదండి..

మగవే కంటాయి..
ఈ జీవిని చూడండి… ఏదో కొమ్మలు, ఆకుల మధ్య దూరి చూస్తున్నట్టు కనిపిస్తుంది కదూ! కానీ ఆ ఆకులూ, చిగుళ్లలా కనిపిస్తున్నదీ దాని శరీరమే. దీని పేరు ‘లీఫీ సీ డ్రాగన్’. బొమ్మల్లో మనకు కనిపించే డ్రాగన్‌లాంటి ఆకారంలో ఉండే సముద్రజీవి అన్నమాట. సీ హార్స్‌గా మనం పిలిచే నీటి గుర్రాల జాతికి చెందినది. ఈ జీవుల రూపమే కాదు, పుట్టుకా విచిత్రమే. ఇందులో మగవే పిల్లల్ని కంటాయి. జట్టుకట్టే ముందు రెండూ కలిసి అందమైన నృత్యం చేస్తాయి. ముఖ్యంగా సాయంత్రాలు ఇలా ఒకదాన్ని మరొకటి అనుకరిస్తూ డ్యాన్స్ చేస్తాయి. రెండిటికీ సమన్వయం కుదిరితే ఆడ సీ డ్రాగన్ గులాబీ రంగులో ఉండే వందా రెండు వందల గుడ్లను మగ దానికి బదిలీ చేస్తుంది.
వీటిలో మగ వాటికి తోక అడుగు భాగంలో ‘బ్రూడ్ ప్యాచ్’గా పిలిచే ప్రత్యేక నిర్మాణం ఉంటుంది. ఆడ డ్రాగన్ బదిలీ చేసిన గుడ్లు దీనికి అతుక్కుంటాయి. దాని ద్వారానే వాటికి ఆక్సిజన్ అందుతుంది. ఈ బ్రూడ్ ప్యాచ్‌లాంటి నిర్మాణంలోనే అవి ఫలదీకరణం చెందుతాయి. నాలుగైదు వారాల తర్వాత మగవే గుడ్డు నుంచి పిల్లల్ని బయటికి వచ్చేలా చేస్తాయి. ఇక, వీటి శరీరం చుట్టూ ఉన్న ఆకుల్లాంటి నిర్మాణాలు వాటి రక్షణ కోసమన్నమాట. నీళ్లలోని మొక్కలు, నాచులో కలిసిపోయేలా ఈ చిగుళ్లలాంటి వాటి రంగులను మార్చుకోగలవు కూడా. పెద్దగా ఈత రాని ఇవి అలా శత్రువుల నుంచి తప్పించుకుంటూ జీవిస్తాయి. ఇంతకీ, ఇవి ఆస్ట్రేలియా పడమర, దక్షిణ ప్రాంతాల్లోని సముద్రాల్లో ఉంటాయి. అంతేకాదు, ఈ జీవి దక్షిణ ఆస్ట్రేలియా ప్రాంతానికి సాగర చిహ్నం (మెరైన్ ఎంబ్లమ్) కూడా!